Trending Now

ఎమ్మెల్యే శంకర్ మదిలో ప్లాన్ “బీ”.. ఎన్నికల్లో పైచేయి కోసం కసరత్తు

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి పట్టు వదలని విక్రమార్కుడిలా ఎమ్మెల్యే సీటును అధిష్టించిన “వీర్లపల్లి శంకర్” వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తనదైన ముద్ర వేయాలని పక్కా ప్రణాళికలు చేపడుతున్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కొంత మౌత్ టాక్ బీజేపీ వైపు ఉన్నప్పటికీ దానిని అధిగమించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదట నియోజకవర్గంలో బీజేపీ ప్రస్తావన ఎక్కువగానే ఉన్నప్పటికీ రానురాను అది క్షీణిస్తుంది. దీనిని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలని భావిస్తుంది. ఎన్నికల కోసం మొదట కాంగ్రెస్ పార్టీలో చేరికల కోసం గేట్లు తెరుస్తున్నామన్న సంకేతాలతో ముఖ్యమైన నాయకులను కొందరిని పార్టీలో చేర్చుకొని ప్లాన్ “ఏ” అమలు చేశారు. ప్రస్తుతం ఇప్పుడు “ప్లాన్ బీ” మొదలు కాబోతుందని సమాచారం.

ఎన్నికల విషయంలో ఎలాంటి పట్టుదలకు వెళ్లకుండా “వార్ వన్ సైడ్” అన్నట్టు పార్టీ చేరికలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇటీవల జరిగిన కొందుర్గు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ ఈ విషయాన్ని కుండలు బద్దలు కొట్టినట్టు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. గొడవలు విభేదాలు అంతర్గత పోరు అంశాలను పక్కనపెట్టి ముఖ్యంగా ఓటు బ్యాంకు కొల్లగొట్టేందుకు పక్క రాజకీయాలు చేయాల్సిందిగా నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే శంకర్ దిశా నిర్దేశం చేశారు. వాడొద్దు, వీడొద్దు అనే మాటలు పక్కన పెట్టి పార్టీని బలోపేతం చేసి కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ను నిలపాలంటే ప్రతి ఒక్కరూ అవసరమేనని, దీనికోసం పది మెట్లు కిందికి దిగాలన్న ఎలాంటి సంకోచం అవసరం లేదని వీర్లపల్లి శంకర్ కార్యకర్తలకు బోధిస్తున్నట్టు సమాచారం.

గతంలో షాద్ నగర్ అసెంబ్లీ పరిధిలో ఎక్కడికక్కడ గ్రూపులు.. ముఖ్య నేతల కొట్లాటలు.. నాయకులకు, పార్టీ శ్రేణులకు మధ్య సమన్వయ లోపం.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహార శైలి… ఇదీ ఒకప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి. కానీ.. ఇప్పుడు ఆ పార్టీ తీరు పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలకు దీటుగా వ్యూహ, ప్రతివ్యూహాలు రచించడం.. ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.. విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడం.. ఇలా ఒకటీ, రెండు కాదు.. అన్ని అంశాల్లోనూ “పైచేయి” సాధిస్తోంది. ఆరు గ్యారెంటీల్లో చాలా పథకాలు అమలు చేస్తున్నామని, ఆగస్టు 15కల్లా రుణమాఫీ సైతం అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడం ద్వారా.. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించబోమన్న సంకేతాలు కాంగ్రెస్ అధిష్ఠానం ఇస్తోంది. రాష్ట్రంలో 17లోక్‌ సభ స్థానాలు ఉండగా.. కనీసం 14 చోట్ల గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వంలో కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా, రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలన్నా.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అన్నీ తానైౖ వ్యూహాలు రచిస్తున్నారు.

దీనికి తోడు ఏ ఎమ్మెల్యే ఎవరెలా పని చేస్తున్నారన్న దానిపై అధిష్ఠానం ఓ కన్నేసి ఉంచడంతో.. తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో పూర్తిగా దృష్టి పెడుతున్నారు. అందుకే స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ “ప్లాన్ బి” అమలు చేసే పనిలో పడ్డారని కార్యకర్తలు చెబుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో పై చేయి సాధిస్తేనే సదరు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వద్ద మార్కులు కొట్టే అవకాశం ఉంటుంది. ఏమాత్రం పరిస్థితి కిందికి మీదికి అయినా గడ్డు పరిస్థితి అని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మోస్ట్ బ్యాక్వర్డ్ జాబితాలో ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో ఆయనకు మంత్రి పదవి పక్కా ఖరారు అవుతుందని పార్లమెంటు ఎన్నికల తర్వాత అవకాశం దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు శంకర్ పాలిట సవాలుగా మారాయి.

ఈ నేపథ్యంలో ఆయన తన విశ్వరూపం ప్రదర్శించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే “ప్లాన్ బి” అమలులో భాగంగా బిఆర్ఎస్ పార్టీలోని ఓటు బ్యాంకు ఉన్న కీలక నాయకులను ముఖ్యమైన కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం అయినట్టు సమాచారం. దీనికోసం ఓ జాబితాను కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. వారం రోజుల్లో కీలకమైన నేతలను కాంగ్రెస్ పార్టీ వల వేసి పట్టుకునే అవకాశాలు లేకపోలేదు. ఎట్టి పరిస్థితుల్లో “పైచేయి” సాధించాలని కృతనిశ్చయంతో ఎమ్మెల్యే శంకర్ ఉన్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికలను ఆషామాశిగా తీసుకోకూడదని ఆయన భావిస్తున్నట్టు దీనికి కారణం.

ముఖ్యంగా ఈ పార్లమెంటు నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించింది కాబట్టి ఈ పార్లమెంటు ఎన్నికలు అంత ఆషామాషీగా తీసుకుని ప్రసక్తే లేదు. మోడీ చరిష్మా, డీకే అరుణ రాజకీయ చతురత పైననే ఓటు బ్యాంకు ఆధారపడి ఉంది. అయితే వీటిని కొల్లగొట్టేందుకు తీసుకోవాల్సిన ప్రణాళికలను అత్యంత జాగ్రత్తగా వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తుంది. పార్టీలో చేరికల సునామి త్వరలోనే మొదలు కాబోతున్నట్టు సమాచారం. ఇకపోతే వీర్లపల్లి శంకర్ కు అదనపు సామర్థ్యంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, మామిడి శ్యాంసుందర్ రెడ్డి, శివ శంకర్ గౌడ్, తాండ్ర విశాల, పి. వెంకట్రాంరెడ్డి మండల పార్టీల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర ముఖ్య పాత్ర పోషించే నాయక గణం ఆయన వెంట ఉన్నారు.

Spread the love

Related News

Latest News