ప్రతిపక్షం, తెలంగాణ: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా.. తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పేరుగాంచింది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున జాతరకు వస్తారు. మేడారం మహా జాతర ప్రధాన ఘట్టం ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలు బుధవారంతో మొదలయ్యాయి. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క, సారక్క జాతరను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు తెలుగులో సందేశం పంపారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగ, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే సమ్మక్క, సారక్క మేడారం మహా జాతర ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదాం.. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందాం’. అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.