ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 15: గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను ఉక్కు పాదంతో అణిచివేస్తామని పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కటిక్స్ బ్యూరో రూపొందించిన వాల్పోస్టర్ ను పోలీస్ కమిషనర్ అనురాధ ఆవిష్కరించి మాట్లాడారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు నిరోధించేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మారకద్రవ్యాలను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం చాలా కీలకమన్నారు.
రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB) టీఎస్ నాబ్ తీవ్రంగా శ్రమిస్తుందన్నారు. గంజాయి, కల్తీకల్లును నిర్మూలిద్దాం మన సమాజాన్ని, మన ప్రజలను మననే కాపాడుకుందాం, గంజాయి, కల్తీకల్లు అల్పోజోలం, డైజోఫార్మా త్రాగడం వల్ల ప్రాణం పోతుందన్నారు. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. గంజాయి, డ్రగ్ మరియు కల్తీ కల్లు అల్ప్రాజోలం, డైజో ఫార్మా సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు, పౌరులు స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్ 8712671111, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100, డయల్ 100 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
పెద్ద ఎత్తున డ్రగ్స్, గంజాయి సమాచారం అందించిన వారికి నగదు రివార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి హోదాల్లో స్థిరపడాలని కలలు కంటున్నారు. కానీ కొంతమంది యువత గంజాయికి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు అయ్యి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వారి తల్లిదండ్రుల కలలు కలలుగానే మిగిలిపోతున్నాయన్నారు. కావున యువత గంజాయికి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, సిద్దిపేట ఏసీపీ మధు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, సీసీఆర్బి ఇన్స్పెక్టర్ గురుస్వామి, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, శ్రీధర్, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ కమలాకర్, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఐటీ సెల్ ఎస్ఐ నరేందర్ రెడ్డి సీసీఆర్బి హెడ్ కానిస్టేబుల్ భాగ్య, తదితరులు పాల్గొన్నారు.