ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, మే 29: హనుమకొండ జిల్లా పరకాలలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న గృహ నిర్మాణాలపై చర్యలు చేపట్టనున్నట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రతిపక్షం ప్రతినిధికి తెలియజేశారు. అక్రమ గృహ నిర్మాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారికి సైతం మెమో జారీ చేయనున్నట్లు వెల్లడించారు. పరకాల కేంద్రంగా అక్రమ గృహ నిర్మాణాల విషయమై ప్రతిపక్షం పత్రిక వరుస కథనాలు విలువరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కథనాలకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులను అక్రమ గృహ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించినట్లు తెలుస్తుంది. విచారణకు వెళ్లిన టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా గృహ నిర్మాణం చేపడుతున్న విషయం వాస్తవ ఆధారాలతో నివేదిక రూపొందించినట్లు తెలిసింది.
అందుకు సంబంధించిన వివరాలను ప్రతిపక్షం ప్రతినిధితో వెల్లడించిన కమిషనర్ మార్కెట్ రోడ్ లోని అనుమతులకు విరుద్ధంగా జీ ప్లస్ 4 నిర్మిస్తున్న గృహాన్ని కూల్చివేయనున్నట్లు వెల్లడించారు. పరకాల పట్టణంలో అక్రమ నిర్మాణలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు చేపడతామని తెలిపారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన టౌన్ ప్లానింగ్ అధికారి రాజుకు మేమో జారీ చేసి వివరణ కోరనున్నట్లు వెల్లడించారు.