ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 20: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మౌలానా ఆజాద్ నగర్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ పరిసరాలలో ఉన్న భారీ మురికి కాలువలో నాలుగు రోజులుగా కొన ఊపిరితో గోమాత కొట్టుమిట్టాడుతుంది. ఇది చూసిన చిన్నారులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీని వెంటనే స్పందించిన ‘ప్రతిపక్షం’ నిర్మల్ జిల్లా ప్రతినిధి మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజుకు సమాచారం అందించి పరిస్థితిని వివరించారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ సిబిఎన్ రాజు వెంటనే ప్రత్యేక క్రేన్ సహాయంతో భారీ మురికి కాలువలో నాలుగు రోజులుగా ఉండి కొన ఉపీరితో కొట్టుమిట్టాడుతున్న గోమాతను పైకి తీయించారు. వెంటనే పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు. పశు వైద్యశాలకు చికిత్స నిమిత్తం వాటిని పంపించారు. నాలుగు రోజులుగా ఎలాంటి ఆహారం నీరు లేక బక్క చిక్కిన గోమాతను చూసిన వారంతా అయ్యో పాపం అంటూ వెళ్లిపోయారే తప్ప ‘ప్రతిపక్షం’ దినపత్రిక ప్రతినిధిలా ఎవరు కూడా సంబంధిత శాఖల అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షించిన వైద్యులు తగిన చికిత్సలు చేసి మందులు వేసి ఆరోగ్యంగానే ఉన్నట్లు నిర్ధారించి సంచారం నిమిత్తం విడిచిపెట్టారు.