రామగిరి కేవికే శాస్త్రవేత్త డాక్టర్ వినోద్ ప్రత్యేక కథనం
ప్రతిపక్షం, మంథని, జూన్ 01 : వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది రైతులందరూ విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఫర్టిలైజర్స్ షాపులు మరియు విత్తన విక్రయ కేంద్రాల్లో విత్తనాల కోసం పరుగులు పెడుతున్నారు. అధిక వ్యవసాయ ఉత్పత్తిలో విత్తన పాత్ర కీలకమైనది మిగతా వాటి పనితీరు విత్తనం యొక్క నాణ్యత పైన ఆధారపడి ఉంటుంది. ఏ పంటలో అయిన అధిక ఉత్పత్తి, ఉత్పాదకతను సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు ఎoచుకోవడం పైన ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో వివిధ వ్యాపారులు నకిలీ విత్తనాలను విచ్చలవిడిగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు వీటిపైన అవగాహన లేకుండా రైతులు కొనుగొలు చేసి ఆర్థికంగా మరియు దిగుబడి పరంగా నష్టపోతున్నారు. కాబట్టి రైతులు ఈ క్రమంలో నకిలీ విత్తనాలను గుర్తించడంలో అవగాహన కలిగి ఉండి ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త వహించాలి మరియు నకిలీ విత్తనం అంటే ఏమిటో తెలిసి ఉండాలి.
నకిలీ విత్తనం అంటే ఏమిటి..?
నకిలీ విత్తనం అనగా నిజమైన రకం కానిది లేదా ఉద్దేశించిన రకం కానిది లేదా విత్తన ధ్రువీకరణ సంస్థ నుండి దృవికరించని విత్తనాలు నకిలీ విత్తనాలుగ పరిగణించబడుతున్నాయి. అంతేకాకుండా అక్రమ విత్తనాలను కూడా నకిలీ విత్తనాలుగా పరిగణిస్తున్నారు. ఉదాహరణకు ఉత్పత్తి, పంపిణీ ప్రక్రియ పూర్తికాని విత్తనాలు వాణిజ్య పరీక్షల నుండి దొంగలించబడిన విత్తనాలు, నకిలీ ప్యాకేజింగ్ చేసిన విత్తనాలు మరియు లైసెన్స్ లేని డీలర్స్ ద్వారా అమ్మబడే విత్తనాలు కూడా నకిలీ విత్తనాలుగా పరిగణిస్తున్నారు. ఈ విత్తనాల నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉంటాయి.
నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా..?
నకిలీ విత్తనాలను రెండు రకాలుగా గుర్తించవచ్చు ఒకటి పంట వేయకముందు రెండోది పంట వేసిన తర్వాత. ఒకవేళ పంట వేయకముందు రైతు నకిలి విత్తనాలను గుర్తించి అవగాహన కలిగి ఉన్నట్లయితే ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చు. అదేవిధంగా పంట వేసిన తర్వాత గుర్తిస్తే ఆర్థికంగా అధికంగా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు విత్తనం వేసే ముందే ఈ విత్తనాలు నకిలీవా లేదా నిజమైన విత్తనాల అని తేడాలు గుర్తించి పరీక్షించుకొని విత్తనం నాటు కోవాలి.
విత్తనం వేయక ముందు నకిలీ విత్తనాలు గుర్తించడం ఎలా..?
1.ఈ విత్తన ట్యాగ్ ల పైన కంపెనీ “లైసెన్స్ నెంబర్”, విత్తనం సమీకరించిన “లాట్ నెంబర్”, QR కోడ్ మరియు ఇతర విత్తన ప్రమాణాలను ముద్రిస్తారు. రైతులు వాటిని సరిచూసుకోవాలి. వీటితో పాటు “Date of packing” మరియు “Validity Dates” కూడా రైతులు సరి చూసుకోవాలి.
- విత్తన కంపనిల నుండి రైతులు విత్తనాలను కొనుగోలు చేసుస్తున్నపుడు వాటిలో మొలక శాతం, జన్యు శాతం మరియు ఇతర పదార్థాలు ముద్రించి ఉంటాయి. మొలక శాతం 80% అంత కంటే ఎక్కువగా ఉండేలా, జన్యు శాతం 98% అంతకంటే ఎక్కువగా మరియు ఇతర పదార్థాలు 2% అంతకంటే తక్కువగా ఉండేలా రైతులు సరిచూసుకోవాలి.
- ఒకవేళ ప్రత్తి విత్తనాలు కొంటున్నప్పుడు బీటీ మరియు నాన్ బీటీ విత్తనాల తేడా కోసం “GEAC” Genetic Engineering and Approval Committee చే ముద్రించిన నంబర్ ఉన్నది లేనిది రైతులు గుర్తించాలి. నంబర్ ఉంటే బిటి విత్తనాలు గా గుర్తించాలి.
- మొదటగా రైతులు ప్రభుత్వ అనుమతి పొందిన లేదా లైసెన్స్ పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనాలి.
- అలాగే విత్తన ధృవీకరణ సంస్థ లైసెన్సు పొందిన విత్తన కంపెనీల నుండి మాత్రమే విత్తనాలు కొనాలి. అలాగే కంపెనీ “ఓలోగ్రం” సరి చూసుకోవాలి.
- తక్కువ ఖరీదు ఉన్న మరియు మూటలలో కట్టిన విత్తనాలను రైతులు ఎట్టి పరిస్థితల్లోనైనా కొనవద్దు.
- కచ్చితంగా విత్తనాలు కొనుగోలుదారు నుండి బిల్లును తీసుకోవాలి.
- ప్రైవేట్ కంపెనీ నుండి విత్తనాలు కొంటున్నపుడు విత్తన సంచి వెనకాల “పచ్చ రంగులో” ఉంచిన “స్టిక్కర్స్ గానీ” లేదా “ట్యాగ్ గానీ” ఉన్నది లేనిది రైతులు గుర్తించాలి. “ట్రూత్ ఫుల్లీ లేబుల్” విత్తనం అయితే “పచ్చ రంగు”, ధృవీకరణ పొందిన విత్తనం అయితే “నీలి రంగు” ట్యాగ్ లు, విత్తన సంచులతో జత చేస్తారు లేదా వెనకాల stickers రూపంలో ముద్రిస్తరు. ప్రత్తి మరియు మిరప విత్తనాల సంచులపై దాదాపుగా ఆకుపచ్చ రంగు “ట్యాగ్లు”ఉంటాయి.
రైతులు నకిలీ విత్తనాలు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు..?
- తక్కువ ధరకు విత్తనాలు మార్కెట్లో దొరకడం
- ఉచిథాలకు రైతులు మ్రోగ్గుచూపడం ఉదాహరణకు మూడు విత్తన సంచులు కొంటే ఒక విత్తన సంచి ఉచితంగా వస్తుంది లాంటివి.
- విత్తనాల ఎంపికలో అవగాహన లేకపోవడం
- రైతులు పెట్టుబడిని తగ్గించుకోవాలి అని అనుకోవడం
- ప్రభుత్వ రంగ సంస్థలు నకిలీ విత్తన వ్యాపారులను అరికట్టక పోవడం.
పంట కాలంలో నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా..?
- విత్తనాలు సరిగా మొలవక పోవడం.
2. మొలకెత్తిన విత్తనాలు ఎత్తుగా పెరగక పోవడం.
- పూర్తి స్థాయిలో పూత రాకపోవడం.
- వచ్చిన పూత రాలిపోవడం మరియు కాయలుగా మారక పోవడం వంటి లక్షణాలు పంట సమయంలో గుర్తించ వచ్చును.
బిటి, నాన్ బిటి ప్రత్తి విత్తనాలను రైతు స్థాయిలో గుర్తించడం ఎలా..?
బిటి విత్తనాలు అనగా వివిధ రకాల చీడ పీడలను తట్టుకొని అధిక దిగుబడి సాధించడానికి జన్యు పరంగా మార్పు చేసిన విత్తనాలు. బిటి ప్రత్తి విత్తనాలు గుర్తించడం కోసం మార్కెట్ లో “Bt Cry 1 Ab/ Cry 1 Ac Rapid detection Kits” అందుబాటులో ఉన్నాయి రైతులు వీటిని ఉపయోగించి బిటి మరియు నాన్ బిటి విత్తనాలను 30 నిమిషాలలో గుర్తించ వచ్చును. ఇందుకోసం విత్తన నమూనా నీ “స్ట్రిప్” లో ఉంచాలి. స్ట్రిప్ లో రెండు గీతాలు వచ్చినట్లయితే బిటి గా లేదా ఒక గీత వస్తే నాన్ బిటి గా గుర్తించవచ్చును.
మొలక శాతం పరీక్షించే పద్దతి..
రైతులు ధ్రువీకరించిన విత్తనాలు ఎన్నుకున్నప్పటికీని ఆ విత్తనాల యొక్క మొలక శాతాన్ని పరీక్షించుకొని విత్తనాలు విత్తుకోవాలి. ఈ మొలక శాతాన్ని రైతులు వివిధ పద్ధతుల్లో చేసుకోవచ్చును. అందుబాటులో ఉన్న పద్ధతులు ట్రే పద్దతి, గుడ్డలో మూటకట్టే పద్ధతి మరియు పేపర్ టోవెల్ పద్ధతి. వీటిలో ట్రే పద్దతి లో రైతులు తేలికగా మొలక శాతాన్ని లెక్క కట్ట వచ్చును. ఈ పద్ధతిలో ఒక ట్రే లో ఇసుకను నింపి పంటగా వేయలనుకున్న “వంద” విత్తనాలను నిర్ణీత ఎడంలో వరుసకు 10 విత్తనాలు చొప్పున నాటాలి. విత్తిన 7-10 రోజులల్లో విత్తనాలు మొలకెత్తుతాయి, వంద విత్తనాలకు ఎన్ని విత్తనాలు మొలకెత్తయో దానిని బట్టి శాతాన్ని లెక్క గట్టలి. 80 శాతం కంటే తక్కువగా వస్తె విత్తన మోతాదు పెంచుకోవడం గాని లేదా ఇతర కంపెనీ విత్తనాలు ఎంచు కోవడం గాని చేయాలి. ఈ విధంగా రైతులు పైన చెప్పించి పద్దతులు పాటించినట్లయితే నకిలీ విత్తన వ్యాపారుల బారిన పడకుండా నాణ్యత బాగున్న విత్తనాలను ఎంచుకొని అధిక దిగుబడులు సాధించ వచ్చును.