ప్రతిపక్షం, ఢిల్లీ: సౌరశక్తి పలకలను ఇళ్ల పైకప్పులపై ఏర్పాటుకు ఉద్దేశించిన ‘ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రారంభంలో దేశవ్యాప్తంగా కోటి ఇళ్లపై రూ. 75,021 21 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విలేకరులకు చెప్పారు. ఈ ప్రతిపాదిత పథకం ద్వారా అదనంగా 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ. 15 వేల ఆదాయం లభిస్తుందని తెలిపారు. సోలార్ పథకం ద్వారా ఆయా కుటుంబాలు విద్యుత్ బిల్లులో ఆదా పొందడంతో పాటు డిస్కంలకు అదనపు విద్యుత్తును విక్రయించుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా 17 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు.