ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, మే 31: రాష్ట్ర చిహ్నం తొలగింపును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని నిరసిస్తూ.. వరంగల్ జిల్లా న్యాయస్థానం ఎదుట అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానుద్దేశించి బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ తుర్లపాటి మహేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే కాకతీయ కళాతోరణం, చార్మినార్ లను కదిలిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని 12 వందల మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న తెలంగాణ ఆశలు ఆకాంక్షలు నేర్చుకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చిహ్నం మార్పుకు ప్రయత్నించడం వివేకమన్నారు. తెలంగాణ ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరిస్తే.. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం. రమేష్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా ప్రజల పాత్ర గణనీయమైందన్నారు. అలాంటి వరంగల్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కాకతీయ కళాతోరణం తొలగిస్తే ధరించేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం లోగో మార్కు విషయంలో పునర్ ఆలోచన చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి. సహోదర రెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.