Trending Now

పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు మౌలిక సౌకర్యాలు కల్పించండి..

టీయూటీఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎ. మురళీ మనోహర్ రెడ్డి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 24 : గత ప్రభుతం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా పాఠశాలల ప్రారంభం నాటికి అన్నిరకాల సౌకర్యాలు కల్పించేందుకు కఠినమైన చర్యలు వెంటనే చేపట్టి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్)రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఏ. మురళీ మనోహర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వీరు మాట్లాడుతూ.. మూతబడిన పాఠశాలలను తెరిపించాలని, అన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ (ఏఏపీసీ) పాఠశాలలతో పాటు, ‘మన ఊరు-మన బడి’ పనులు వేగవంతం చేసి, పాఠశాలల ప్రారంభం నాటికి పూర్తి అయ్యేట్లు తగుచర్యలు తీసుకోవాలని, ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడు-ప్రతి తరగతికి ఒక గది ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

బదిలీ పొంది విడుదల కాని ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని వారి స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులు వచ్చే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. నిలిచిపోయిన బదిలీలు పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని, ప్రతి పాఠశాలకు ఒక పారిశుద్ధ్య కార్మికుడు, ఒక నైట్ వాచ్మెన్‌ను నియమించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెగ్యులర్ డి.ఇ.ఓ. లు,అన్ని మండలాలకు రెగ్యులర్ ఎంఈఓ లు ఉండునట్లు జీవో.2018 ననుసరించి నూతన సర్వీస్ రూల్స్ రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోడిశెట్టి రవికాంత్, వహీద్ ఖాన్, జిల్లా కోశాధికారి పోల ధర్మరాజ్, ఎ. లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, వివిధ మండలాల బాధ్యులు మొయిజుద్దీన్, మతీన్, లక్ష్మారెడ్డి, కరిపే శివప్రసాద్ పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News