ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 14 : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో నిన్న రాత్రి ఎన్నికల విధులు ముగించుకుని వచ్చిన ఉపాధ్యాయులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తెలంగాణ పీఆర్టీటీయూ నిర్మల్ జిల్లా శాఖ అధ్యక్షుడు కార్యదర్శులు యాటకారి సాయన్న, ప్రధాన కార్యదర్శి వోడ్నాల రవిరాజు లు ప్రకటనలో తీవ్రంగా మండిపడ్డారు. ఈ సంఘటనను ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి సమాన రెమ్యూనరేషన్ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ, తక్కువ డబ్బులు ఇస్తూ.. ఎందుకు తక్కువ ఇస్తున్నారని ప్రశ్నించినందుకు, ఉపాధ్యాయులపై లాఠీ ఛార్జ్ చేయడం హేయమైన చర్యనని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి, ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొని ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించిన అధికారులకు ఇచ్చే బహుమానం ఇదేనా అని వారు ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులదేనని చెప్పారు. కారకులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉపాధ్యాయుల తరఫున వారికి న్యాయం జరిగే వరకూ ఉద్యమించడానికి, తెలంగాణ పీఆర్టీయూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.