బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు
ప్రతిపక్షం, దుబ్బాక, ఏప్రిల్22: బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని నరేంద్ర మోడీ సారథ్యంలోనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. సోమవారం దుబ్బాక పట్టణంలో బీజేపీ నాయకులులతో కలిసి ఆయన ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో తనను పార్లమెంటు అభ్యర్థిగా గెలిపిస్తే దుబ్బాక నియోజకవర్గం ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన తాను మూడేళ్ల కాలంలో క్యాంపు కార్యాలయంలో నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ప్రజల సమస్యలను పరిష్కరించడమే గాక అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి దుబ్బాక అభివృద్ధికి నిరంతరం కృషి చేశా న న్నారు.
ఇటీవల ఎమ్మెల్యే గా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి మాత్రం ఐదు నెలలు కావస్తున్న నేటి వరకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభించుకోకపోవడం ఆయన అసమర్ధ పాలనకు నిదర్శనం అన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో ఐదు నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించకుండా ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఏదో చుట్టపు చూపుగా వస్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ని దుబ్బాక ప్రజలు, ఓటర్లు గమనించాలని కోరారు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఐదు నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన వ్యక్తి మాత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు.
గతంలో ఎమ్మెల్యే హోదాలో ఉన్న తాను అలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే జేబులో కత్తెరలు, కొబ్బరికాయలు పెట్టుకొని వెళుతున్నానని తనని పదే పదే దూషిస్తూ.. కార్యక్రమాలకు అడ్డు తగిలిన బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుతం ఏ పదవి లేని కాంగ్రెస్ ముఖ్య నాయకుడు శంకుస్థాపనలు చేసుకుంటూ వెళుతున్న బీఆర్ఎస్ నాయకులు స్పందించడం లేదని, దానికి కారణం ఏమిటో వారి ఎమ్మెల్యే నే సమాధానం చెప్పాలన్నారు. తాను ఓడిన గెలిచిన ప్రజల గుండెల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి ఎంపీగా గెలిపిస్తే 100 కోట్లతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసి యువతను, పేద విద్యార్థులను ఆదుకుంటానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
దుబ్బాక లోని కస్తూర్బా పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని దరఖాస్తు పెడితే నిధులు మంజూరు చేయని దుర్మార్గమైన వ్యక్తి వెంకటరామిరెడ్డి మాటలను దుబ్బాక ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. వేముల ఘాట్ గ్రామంలో మల్లారెడ్డి అనే భూ నిర్వాసితుడు తన ఇంటి కట్టెలను తానే చితిగా పేర్చుకొని దహనం చేసుకుంటే స్పందించని మూర్ఖుడు వెంకట్రాంరెడ్డి అని తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ఎంతోమంది భూనిర్వాసితుల ఉసురు తీసిన ఘనుడు వెంకటరామిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా పనిచేసిన కాలంలో ఎంతమంది రైతులకు న్యాయం చేశాడో మల్లన్న సాగర్ లో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు వెంకటరామిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దనీ.. ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు, సెల్ఫ్ ఉద్యోగులు, డీఆర్డీఏ ఉద్యోగులను ఆయన కోరారు. నిరంతరం మీ సమస్యలే పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడిన వ్యక్తిని కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో తనను బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి గా భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.