ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 16 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లికి చెందిన గొల్లపల్లి రాజమల్లును తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమిస్తూ.. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల్లి వెంకన్న ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఈ సంఘ కార్యకలాపాలు నిర్వహించే ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణ సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సేవా సంఘాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు అనుచరుడైన రాజమల్లు సంఘ సమస్యల పరిష్కారంతోపాటు, పటిష్టత కోసం చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజమల్లు మాట్లాడుతూ.. నాయిబ్రాహ్మణుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో నాయి బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి తమ సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహాయ, సహకారాలతో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన సంఘం నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.