బయటకు రావద్దంటున్న నిపుణులు
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: మే నెల వచ్చేసింది. మే నెలలో రోళ్లు సైతం పగులుతాయన్న పెద్దల మాట నిజమని పిస్తోంది. మేనెల మొదటి రోజునే మాడు పగిలిపోతోంది.. బయటికెళ్తే ఎండ, వేడి మామూలుగా లేవు..! అప్పుడే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. వడగాలులు, ఉక్కపోత ఠారెత్తిస్తున్నాయ్. పలుచోట్ల 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ, ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే మరో 4 రోజులపాటు ఎండలు మరింత పెరగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు.. తీవ్ర వడగాలులు వీచే అవకాశముంది. తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వడగాలులు తప్పవని, ఎండల తీవ్రత కూడా పెరిగే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌లో పెరిగిన ఎండతీవ్రత నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఎండలు మండుతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, ఎస్ఆర్ఎస్ పీ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. అటు కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.తెలంగాణ, ఏపీ అనే కాదు.. దేశంలోని చాలా ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45డిగ్రీల మార్కును దాటి.. ఎక్కువగా నమోదవుతున్నాయి. గత ఏడాది నమోదైన రికార్డులను బద్దలు కొడుతూ వేసవిలో దేశం భగభగ మండిపోతోంది. ఈ వేడి వాతావరణానికి కారణం కాలుష్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు అని నిపుణులు సెలవిస్తున్నారు.