Red alert again for Budameru catchment areas: ‘బుడమేరు’.. విజయవాడ ప్రజల్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పేరు. ఇటీవలి వరదల్లో విజయవాడ నగరాన్ని ముంచేసింది కూడా బుడమేరే. కుండపోత వర్షాలకు తోడు బుడమేరులోకి రికార్డు స్థాయిలో వరదనీరు చేరడంతో గండ్లు పడి వరద నీరు విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలను ముంచెత్తింది. అయితే, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చి వేసింది. దీంతో ముంపు ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతుండటంతో బాధితులు ఊపీరిపీల్చుకుంటున్నారు. తాజాగా మరోసారి భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు బుడమేరులోకి భారీగా వరదనీరు చేరుతుండటంతో ముంపు ప్రాంతాల ప్రజల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే బుడమేరు ప్రాంతానికి వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు.