దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నిన్న వైభవంగా జరిగాయి. ప్రజలందరూ భక్తి, శ్రద్ధలతో జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తమ కూమారుడు/కుమార్తెలను శ్రీకృష్ణుడు/గోపిక వేషధారణలో అలంకరించుకొని తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇక కృష్ణాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.25,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు వ్యాపారుల సమాఖ్య కాయిట్ (కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్- CAIT) వెల్లడించింది.
పూలు, పండ్లు, మిఠాయిలు, పూజా సామగ్రి, అలంకరణ వస్తువులు, పాలు, పెరుగు, వెన్న, డ్రై ఫ్రూట్స్ పెద్ద ఎత్తున అమ్ముడైనట్లు ఆ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు సహా పల్లెల్లో ఆగస్టు 26న పెద్ద ఎత్తున జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు రాఖీ పండగ సందర్భంగా దాదాపు రూ.12,000 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుందని కాయిట్ అంచనా వేసింది. 2022లో ఈ పండగ సందర్భంగా రూ.7,000 కోట్లు, 2021లో రూ.6,000 కోట్లు, 2020లో రూ.5,000 కోట్ల విలువ చేసే విక్రయాలు జరిగినట్లు కాయిట్ పేర్కొంది.