నిర్మల్ పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితులు దుర్భరంగా మారాయి. మూడు నెలలుగా వారికి జీతాలు అందడం లేదు. దీంతో ఇవాళ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారం కష్టమవుతోందని, అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూడు నెలల జీతాలతో పాటు, పీఎఫ్ డబ్బులు కూడా అందజేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే మంగళవారం నుండి విధులను బహిష్కరించి ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ నిరసనల్లో మహిళా పారిశుద్ధ్య కార్మికులు సైతం పాల్గొన్నారు.