Trending Now

టానిక్ లిక్కర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం టానిక్​ లిక్కర్​ దుకాణాలపై ప్రత్యేక ప్రేమ కనబరిచింది. ప్రత్యేక ఉత్తర్వులతో ఏర్పడిన ఈ దుకాణాలకు టాక్స్​లో కూడా రిబేట్​ ప్రకటించింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన టానిక్ లిక్కర్ కేసుకు సంబంధించి తాజాగా తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. 2016లో టానిక్ సంస్థ కోసం ఒక చీకటి జీవో తీసుకొచ్చారని.. వైన్ డీలర్స్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పైలెట్ ప్రాజెక్టు కింద టానిక్ సంస్థకు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేవలం టానిక్ సంస్థకు మాత్రమే 13.6% టాక్స్ కట్టకుండా వెసులుబాటు కల్పించారని చెప్పారు. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కలిసి.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు.

స్పెషల్ జీవోపై తాము మేము తెలంగాణ హైకోర్టులోపిటిషన్ వేయగానే.. రాత్రికి రాత్రి రూల్స్ ఫ్రేమ్ చేసి, లైసెన్సులు మంజూరు చేశారని వెంకటేశ్వరరావు తెలిపారు. అందులో టానిక్ సంస్థ లబ్ధి పొందేలా ఐదు సంవత్సరాల పాటు ‘టాక్స్ ఫ్రీ’తో పాటు 18 డిపోల నుంచి వైన్‌ను దిగుమతి చేసుకునేలా సౌకర్యం కల్పించారని అన్నారు. మిగిలిన వారికి మాత్రం.. కేవలం తమకు కేటాయించిన డిపోలలో మాత్రమే దిగుమతి చేసుకొనేలా ఆదేశాలిచ్చారని చెప్పారు. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం.. కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందని వివరించారు. కేవలం టానిక్ సంస్థకు మాత్రమే ఈ స్పెషల్ జీవో వర్తించేలా.. ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.


మిగిలిన షాపులతో పోలిస్తే.. టానిక్ షాప్‌లకు రెండు గంటలు అదనంగా అమ్మకాలు చేసుకునేలా వెసులుబాటు కల్పించారని వెంకటేశ్వరరావు చెప్పారు. దీని వల్ల మిగిలిన వ్యాపారవేత్తలకు తీవ్రంగా నష్టం జరిగిందన్నారు. ఫారిన్ లిక్కర్ కూడా 18 డిపోల నుంచి టానిక్ సంస్థ దిగుమతులు చేసుకునేలా ఆ జీవోలో ఉందన్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఇదిలావుండగా.. ఏడేళ్లుగా టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వందల కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ప్రాథమికంగా తేలింది. దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది.

Spread the love

Related News

Latest News