తెలంగాణలో తూఫాన్ వాతావరణం
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: ఈ నెల 19వ తేదీన నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల్ని చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తుఫాను తరహా వాతావరణం ఏర్పడుతుందని, మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.రాబోయే ఏడు రోజులు ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం నాడు తెలంగాణ అంతా దట్టమైన మేఘాలు అలముకుంటాయి.
నైరుతి తెలంగాణలో మోస్తరు వాన కురుస్తుంది.హైదరాబాద్ తోపాటు దక్షిణ రాయలసీమలో సాధారణ వానలు కురవనున్నాయి. ఈ సమయంలో గాలులు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. ఉష్ణోగ్రత తెలంగాణలో 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉంటుంది. దట్టమైన మేఘాలు రాష్ట్రాన్ని అలముకొని ఉండటంవల్ల ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తర తెలంగాణ మినహా మిగతా ప్రాంతమంతా తేమతో ఉంది. హైదరాబాద్ లో 52 శాతం తేమ నమోదైంది.