షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడి చేసి.. ఓట్ల ఆశ కోసం అనర్హులకు ఎంతోమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించిందని.. అధికారులపై ఒత్తిడి తెచ్చి తలుపులు మూసుకుని మరీ లబ్ధిదారులను ఎంపిక చేశారని ఇది చాలా ఘోరమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో పత్రికా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు తమకు అనుకూలంగా ఉన్న వారికి ఇళ్లను కేటాయించాలని ఆరోపించారు.
అర్హులను ఎంపిక చేయకుండా ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని వాటన్నిటిని ఇప్పటికే జిల్లా కలెక్టర్ అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లామని చెప్పారు. త్వరలోనే అర్హులను గుర్తించి పార్లమెంటు ఎన్నికల తర్వాత జూన్ చివరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేస్తామని అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో అర్హులు ఉంటే వారిని తీసివేయమని స్పష్టం చేశారు. అర్హులు ఉంటే వారికే ఇల్లు దొరుకుతుందని అనర్హులు ఉంటే వారిని తీసేసి అర్హులకు ఇస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.
పట్టణంలో ఎన్నోసంచార జాతుల వాళ్ళు జీవిస్తున్నారని ఉండడానికి కనీసం నివాసం లేక పూరి గుడిసెల్లో, చెట్ల కింద జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంచార జాతుల్లో ముఖ్యంగా మందుల వాళ్లు, డక్కలి, పూసలొల్లు, ఇళ్లల్లో పాచి పని చేసేవారు ఇలా అర్హులు ఎందరో ఉన్నారని వాస్తవానికి వారికి ఇండ్లు దక్కాలని అన్నారు. త్వరలోనే ఎన్నికలు ముగిశాక అధికారులతో మాట్లాడి ఇండ్ల పంపిణీ పై పూర్తి శ్రద్ధ తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, చెంది తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, కృష్ణవేణి, అందె మోహన్, శ్రీశైలం గౌడ్ రాజేష్ నెహ్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.