ప్రతిపక్షం, వెబ్ డెస్క్: నేటి నుండి జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో పాల్గొంటున్న విద్యార్థులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల మదిలో ఎలాంటి భయాందోళన లేకుండా తాము చదువుకున్న పాఠాలు గుర్తుతెచ్చుకొని ప్రశ్నలకు సరైన జవాబులు రాసి నిలకడగా నిశ్చింతగా విద్యార్థులు వ్యవహరించాలని కోరారు. పరీక్షా సమయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఏవైనా అనుమానాలు ఉంటే ఇన్విజిలేటర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. గ్రామీణ ప్రాంత నుండి వచ్చే విద్యార్థులు ఎవరైనా పరీక్షా సమయం దాటిపోతుందని లిఫ్ట్ అడిగితే ప్రజలు మానవతా దృక్పథంతో సహకరించాలని సూచించారు. అదేవిధంగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత రవాణా సదుపాయం కల్పించింది. పదో తరగతి హాల్‌టికెట్‌ను చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వెళ్లోచ్చు. అల్ట్రా పల్లె వెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఉచితంగా వెళ్లి రావొచ్చని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో 239 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. దీనికోసం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న 50,946 మంది విద్యార్థులు.. 5 నిమిషాల వరకు ఆలస్యానికి అనుమతి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు.