బయో మైనింగ్ యంత్రం ఏర్పాటు..
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ ప్రాంతంలో నెలకొన్న డంప్ యార్డ్ తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో అనేక పోరాటాలు జరిగాయని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగిందని, ప్రస్తుతం అక్కడి ప్రాంత ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని బయోమైనింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని దీనివల్ల చెత్తను పూర్తిస్థాయిలో తొలగించి మళ్లీ వాటిని ఉపయోగపడేలా రీసైక్లింగ్ చేయడం మున్సిపాలిటీకి ఆదాయం సమకూరడం లాంటి చర్యలను ప్రభుత్వం చేపట్టిందని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బయో మైనింగ్ అనేది ఇప్పటికే పేరుకుపోయిన పట్టణ ఘన వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియ అని, ఇది లెగసీ డంప్ సైట్‌లను శుభ్రం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. మెరుగైన ఉపయోగం కోసం శాస్త్రీయంగా తిరిగి పొందడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు. ఈ రోజుల్లో ఈ ప్రక్రియ చాలా కీలకమైనదని నిజానికి నగరం వెలుపల ఉన్నట్లు భావించబడిన డంప్ యార్డుల వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజలు అనేక రుగ్మతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వీటి పరిష్కారం కోసం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాంకీ సంస్థ ద్వారా బయో యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
దీని కోసం స్థానిక కౌన్సిలర్ కృష్ణవేణి, స్థానిక నాయకులు శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో స్థల పరిశీలన కూడా జరిగిందని అక్కడ యూనిట్ ఏర్పాటు అవుతుందని చెప్పారు. రెండున్నర కోట్ల రూపాయల సామర్థ్యం గల ఈ యంత్రం ద్వారా రోజుకు 50 టన్నుల చెత్తను శుభ్రం చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో 400 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని తెలిపారు. సోలిపూర్ వద్ద ప్రస్తుతం ఈ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని మరో ఆరు నుండి తొమ్మిది నెలల్లో స్థల మార్పు కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు.
కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో చెత్తను రీసైకిలింగ్ చేసి మళ్లీ అది ఉపయోగపడే విధంగా మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వంలో పాలకవర్గం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఉన్నప్పటికీ పాలనపరంగా వారికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం ఉత్సవ విగ్రహాల్లా ఉండాల్సిన అవసరం వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఉండవని రాజకీయాలకు పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి అభివృద్ధి పనులు చేపట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సోలిపూర్ కౌన్సిలర్ కృష్ణవేణి, స్థానిక నాయకుడు పులిమామిడి శ్రీశైలం గౌడ్, అదేవిధంగా పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెంది తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.