ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 3: రెండవ విడత ఎన్నికల శిక్షణలో భాగంగా ఇప్పటివరకు పీ ఓ, ఏ పీ ఓ లకు జరిగిన రెండు రోజుల శిక్షణకు మొత్తం 75 మంది ఉద్యోగులు గైరాజరైనందున, వారికి ఆర్ డి ఓ, సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారుల ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. రెండవ విడత శిక్షణలో భాగంగా మే 1 న పి ఓ, ఏ పి ఓ లకు ముధోల్ నియోజకవర్గం లో ఐఐఐటీ బాసర లో జరిగిన శిక్షణ కార్యక్రమానికి 25 మంది, నిర్మల్ నియోజకవర్గం లో సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణా కార్యక్రమానికి ఇద్దరు, ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణా కార్యక్రమానికి 7 గురు చొప్పున మొత్తం 34 మంది గైరాజరైనారని, అదేవిధంగా మే రెండవ తేదీ నాడు పీ ఓ, ఏ పీ ఓ లకు జరిగిన శిక్షణ కార్యక్రమాలకు ముధోల్ నియోజకవర్గం లో 26 మంది, నిర్మల్ నియోజకవర్గంలో ఎనిమిది మంది, ఖానాపూర్ నియోజకవర్గం లో ఏడుగురు చొప్పున మొత్తం 41 మంది గైరాజరైనారని ఆయన తెలియజేశారు. షోకాజ్ నోటీసులు జారీ అయినా మొత్తం 75 మంది, ఇవ్వబడిన నోటీసులకు రేపు సరైన వివరణ ఇవ్వాలని, అదేవిధంగా రేపు జరిగే ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి ఆయా నియోజక వర్గాల పరిధిలో వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో తప్పకుండా శిక్షణకు హాజరుకావాలని, లేనియెడల ఎన్నికల నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హెచ్చరించారు.