ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 06: ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న కార్మికుల జీతాలు వెంటనే విడుదల చేయాలని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట బిఎఫ్టుయు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా BFTU రాష్ట్ర నాయకులు దబ్బేట ఆనంద్ సిద్దిపేట జిల్లా, కన్వీనర్ శివరాత్రి శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న సానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్, ఉద్యోగ కార్మికులకు సుమారు150 మందికి నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి జీతభత్యాలు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
గతంలో కూడా పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ కి వినతిపత్రం అందజేసినట్లు గుర్తు చేశారు. అయినా కూడా ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న జీతాలు విడుదల చేయలేదని, కుటుంబ పోషణకు చాలా ఇబ్బందికరంగా మారిందని అందువల్ల హాస్పిటల్ లో పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ విమల తామస్ వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న జీతభత్యాలను సోమవారం సాయంత్రం లోపు పడేవిధంగా చూస్తామని ఫోన్లో మాట్లాడి చెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. రెండు రోజుల్లో జీతాలు విడుదల కాకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు.