ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసం ఏర్పడిన BRICS(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) కూటమిలో చేరడానికి ఆసక్తిగా ఉన్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం తొలుత ఇండియా సపోర్ట్ కోరుతున్నట్లు పేర్కొన్నారు. భారత్ భాగంగా ఉన్న బ్రిక్స్ మంచి కూటమిగా మారిందని చెప్పుకొచ్చారు.
బ్రిక్స్ ఎలా ఏర్పడింది..?
అభివృద్ధి చెందుతున్న దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా కలిసి 2006లో ‘బ్రిక్’ ఏర్పడింది. రాజకీయ, భద్రత, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, మానవత్వ సేవల్లో సహకారం కోసం పనిచేస్తోంది. 2010లో సౌతాఫ్రికా చేరడంతో బ్రిక్స్‌గా మారింది. ఈ ఏడాది జనవరిలో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ కొత్తగా చేరడంతో పది దేశాలయ్యాయి. దీంతో ‘బ్రిక్స్ ప్లస్’గా పేరు మార్చాలని దేశాధినేతలు యోచిస్తున్నారు.
‘బ్రిక్స్’కు ప్రాధాన్యత ఎందుకు..?
2023 DEC నాటికి బ్రిక్స్‌లోని 5 దేశాల జనాభా 324 కోట్లు. GDP 26 ట్రిలియన్ డాలర్లు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 26 శాతానికి సమానం. IMF, ప్రపంచ బ్యాంకుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ కూటమి కృషి చేస్తోంది. పేద దేశాలకు రుణాలు ఇవ్వడం కోసం రూ.20.78 లక్షల కోట్లతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(NDB)ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి బలంగా మారడంతో ఇందులో చేరడానికి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.