తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నిజామాబాద్ జిల్లా ఎగువ భాగాన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 40 గేట్లను ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,95,767 క్యూసెక్కుల నీరు వస్తోంది. 40 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులు నీటిని దిగువకు వదులుతున్నారు. కాకతీయ ప్రధాన కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా ఐదువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 72.6 టీఎంసీల నీరు నిలువ ఉంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. మరోవైపు మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. సాలుర అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద లో లెవల్ బ్రిడ్జి కింది నుంచి వరద నీరు భారీగా పారుతోంది.