ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 4 : దేశ సమగ్రాభివృద్ధి పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలకు సైతం వెనుకాడని కుటుంబం రాహుల్ గాంధీదేనని ఆయనను ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడదామని రాష్ట్ర మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధినేతలు పదవుల ఆశతో ప్రజాసేవ చేయరని అందుకు నిదర్శనమే 34 ఏళ్లుగా గాంధీ కుటుంబం ఉన్నత పదవులను కూడా త్యాగం చేసిందని చెప్పారు. భారతదేశం ఆందోళనకరమైన పరిస్థితులలో ఉందని పదేళ్ల బీజేపీ పాలనలో దేవుళ్ళ పేరిట రాజకీయాలు చేయడమే తప్ప దేశ సంక్షేమం పట్టలేదని చెప్పారు.
ప్రజలు సంక్షేమం గురించి అడిగితే అక్షింతలు ఇస్తున్న చరిత్ర బీజేపీని ఎదవ చేశారు. పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక ప్రాజెక్టు మంజూరు కాలేదని గుర్తు చేశారు. ఐదేళ్లుగా బీజేపీ ఎంపీ ప్రాతినిధ్యం వహించిన ఆదిలాబాద్ లో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ వినూత్నమైన సంక్షేమ పథకాలు మ్యానిఫెస్టో తో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ను ఆదరించి ప్రధానిగా రాహుల్ గాంధీని చూడడమే మన అందరి లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు.
మైదానంలో క్రీడలాంటివి రాజకీయాలు..
మైదానంలో క్రీడలు మాదిరి రాజకీయాలు కొనసాగుతాయని శత్రువులు, మిత్రులు అవుతారు మిత్రులు, శత్రువులవుతారంటూ.. కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు డీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి అన్న ఇంద్రకరణ్ రెడ్డి పేర్లను సంబందిస్తూ మంత్రి సీతక్క చెప్పారు. గతంలో వీరు ఇరువురు కాంగ్రెస్ లో ఉండి కూడా ప్రజాసేవ చేశారని మధ్యలో బీఆర్ఎస్ లోకి వెళ్లారని తిరిగి సొంత గూటికి రావడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. వర్గ విభేదాలను వీడి మిగిలి ఉన్న పది రోజులు అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆదివాసి మహిళ ఆత్రం సుగుణ గెలుపు కోసం కలిసికట్టుగా ఉండి కష్టపడాలని ఈ సందర్భంగా ఆమె హితబోధ చేశారు.
టీపీసీసీ కార్యదర్శి, అదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల కు ఆర్డినేటర్ శ్రావణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వినూత్నమైన సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ఏ మాదిరేది అమలు చేస్తున్నామో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదే రీతిలో సంక్షేమ పథకాలు అమలు అవుతాయని చెప్పారు. బడా బాతాకానిలు చేస్తున్న బిజెపి నాయకులు పక్క రాష్ట్ర మహారాష్ట్రలో తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై పదేపదే నోరు జారుతున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ఈ పార్లమెంట్ ఎన్నికలలో తమ ఓటు ద్వారా ఆదిలాబాద్ ఓటర్లు చరమగీతం పాడాలని కోరారు.
మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైన మని వ్యవస్థలను మార్చే పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేవని పేర్కొన్నారు. బీజేపీకి తగిన మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు కూడా తొలగించే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ హవా ఉందని సర్వేల ద్వారా తెలుసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ లు సహ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పై చేస్తున్న తప్పుడు ఆరోపణలు సరైనవి కావని చెప్పారు. బీజేపీవి మత రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు. గతంలో బీజేపీ ఎంపీలుగా ఉన్న స్వయం బాబురావు, గూడం నగేష్ లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చేసిన ఘనమైన కార్యం ఒకటి లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఇంద్రకరణ్ రెడ్డి అభిమానులు ఆయా విభాగాల పదాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.