ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీకే నగర్‌లో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కారుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడి సమయంలో హరీశ్ వెంట మాజీ మంత్రులు సబిత, జగదీష్ రెడ్డి, పువ్వాడ, మాజీ ఎంపీ నామానాగేశ్వర్ రావు కారులోనే ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ దాడి వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీనే అని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
మరోవైపు, భారీ వర్షాలు, వరదల కారణంగా 30 మంది చనిపోతే.. కేవలం 15 మందే చనిపోయారని చెబుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. చనిపోయిన వారి సంఖ్యను కూడా ప్రభుత్వం తక్కువగా చూపుతోందన్నారు. వరద ప్రాంతాలను పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సాగర్ ఎడమకాలువకు గండి పడిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆరోపించారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, నష్టపోయిన వారికి తక్షణమే రూ.2 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.