ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, జూన్ 11: ఎండల ప్రభావమో.. తాగిన మైకమో
తెలియదు కానీ ఓ వ్యక్తి 7 గంటలుకుపైగా చెరువు నీటిలో పడుకున్నాడు. చెరువు నీటిలో శవం మాదిరి పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు ఆత్మహత్యో, హత్యో జరిగి ఉంటుందని భావించి పోలీసులకు, 108 కు సమాచారం అందించగా వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు చెరువులో దిగి శవమనుకొని సదరు వ్యక్తిని చెరువులో నుంచి పైకి లాగే ప్రయత్నం చేయగా దిగ్గున లేచి కూర్చున్న వింత ఘటన హనుమకొండ నగర శివారులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు హనుమకొండ యాదవ నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు చేరుకునే రూట్లో కోయిలకుంట చెరువులో నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కదలని స్థితిలో పడి ఉన్నాడు. అతగాడిని గమనించిన అటుగా వెళుతున్న పలువురు వాహనదారులు ఇదంతా గమనించి ఆత్మహత్యో, హత్యో జరిగి ఉంటుందని భావించి 100, 108 లకు సమాచారం అందించడం జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు, 108 సిబ్బంది సైతం చెరువులో విగాత జీవిలా పడి ఉన్న వ్యక్తి స్థితిని చూసి మృతదేహం అని భావించి కానిస్టేబుల్ చేయి పట్టి చెరువు నుంచి బయటికి లాగే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటి వరకు శవంలో పడి ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దిగ్గున లేచి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. అతడి స్థితిని చూసి విషయాన్ని ఆరా తీస్తే ఎండలు మండిపోతున్నాయి. పనిచేయలేక నేను ఓడిపోయాను అందుకే ఇలా పడున్నాను అంటూ సమాధానమిచ్చాడు. తనకు ఓ 50 రూపాయలు కావాలని ఇస్తే తను పనిచేసే ప్రాంతం కాజీపేటకు వెళ్ళిపోతానని అన్నాడు. ఈ తతంగమంతా వీడియో షూట్ చేసిన వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది.