Trending Now

కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మరణం.. సీఎం దిగ్భ్రాంతి
ప్రముఖ సాహిత్యకారుడు, కవి, రచయిత అందెశ్రీ (64) ఆదివారం రాత్రి మృతిచెందారు. ఆయన తన ఇంటిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి ప్రతీకగా అందెశ్రీ పనిచేశారు. ఆయన రచనలు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేశాయి. అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల పలువురు కవులు, రచయితలు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు. అందె శ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ… ఆయన మరణం పట్ల ముఖ్యమంత్రి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు‌.

Spread the love