ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 01: రాష్ట్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు కొనుగోలు కోటా విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు సమన్వయ సమితి సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కోట విడుదల చేసి పొద్దుతిరుగుడు కొనాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట మార్కెట్ యార్డులో నిరసన తెలుపుతున్న రైతులకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం రైతులతో కలిసి వారు మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఆరుతడి పంటలను, వాణిజ్య పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించిందని.. అందుకే ఎక్కువమంది రైతులు వాణిజ్య పంటలవైపు మల్లారని గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వ కోట ముగియడంతో సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు కొనుగోలు నిలిచిపోయాయని అన్నారు. మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన పొద్దుతిరుగుడు కొనుగోలు చేయకపోవడంతో ఇక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ కోటా విడుదల చేసి పొద్దుతిరుగుడు కొనేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.