Telangana Govt Announces Bonus For Singareni Employees: సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. దీపావళి బోనస్ కింద రూ.93,750 నగదును నేడు ఖాతాల్లో జమ చేయనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో సింగరేణిపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు బోనస్ కోసం ఆ సంస్థ రూ.358 కోట్లను విడుదల చేయనుందన్నారు. గతేడాది చెల్లించిన దీపావళి బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికమని వివరించారు. దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ.93,750లు అందుతాయని, సంస్థలో పనిచేస్తున్న దాదాపు 42వేల కార్మికులకు అందనుంది. బొగ్గు పరిశ్రమ కోసం జేబీసీసీఐ విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్‌ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంది. ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలిచ్చారు. ఇటీవలే సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద రూ.796 కోట్లను కంపెనీ పంపిణీ చేసిందని సింగరేణి సీఎండీ తెలిపారు.