Telugu Pilgrims Stuck In Kedarnath: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలతో పలుచోట్లు కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్-బద్రీనాథ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చాలామంది యాత్రికులు చిక్కుకున్నారు. ఈ యాత్రికుల్లో తెలుగు రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా తెలంగాణలోని నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం వాసులు కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుపోయారు.
ఏపీ, తెలంగాణ నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18మంది వెళ్లినట్లు సమాచారం. కేదార్‌నాథ్ దర్శనం తర్వాత వీరిలో భద్రీనాథ్ దర్శనానికి 14 మంది బయలుదేరారు. ఈనెల 11 నుంచి తెలుగు యాత్రికులు అక్కడే ఉండిపోయారు. వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణంతో హెలికాప్టర్ సర్వీసులు కూడా నిలిపివేశారు.