ప్రతిపక్షం, అమరావతి: అమరావతిలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తమ 1560 రోజుల ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ, లోక్ సభ ఎన్నకలకు సంబంధించి షెడ్యూల్ విడుదలై, ఎన్నికల నియామావళి అమలులోకి వచ్చినందు వల్ల ఉద్యమాన్ని విరమించవలసిందిగా ఎన్నికల కమిషన్ చేసిన సూచన మేరకు అమరావతి జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇళ్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని జేఏసీ తెలిపింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తేవడంతో అమరావతి రైతులు తీవ్ర అసంతృప్తితో ఉద్యమబాట పట్టారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో తిరుమలకు పాదయాత్రతో పాటు అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు.