హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణాలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగాను మొదటి జాబితాలో నలుగురి అభ్యర్థిత్వాలను అధిష్టానవర్గం ఖరారు చేసింది. మిగతా 13 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు చెందిన నేతలతో పాటు ఇటీవల ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ తీర్థం తీసుకున్న నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఆది, సోమవారం నాడు దేశ వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపికపై సమావేశమైన సీడబ్ల్యూసీ ఒడపోయిన జాబితాను సీఈసీ కసరత్తు చేసింది. తెలంగాణా అభ్యర్థులను ఖరారు చేయలేదు. అయితే 6 లోక్‌సభ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపిక ఏకాభిప్రాయం వచ్చిందని, మిగతా ఏడింటిలో అభ్యర్థుల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ముందు వరుసలో ఉండగా, కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌పార్టీలో చేరిన నేతలకు టికెట్టు ఇవ్వాలని వచ్చిన సూచనను, కొంత మంది వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలో రెండో జాబితా విడుదలపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ(సీఈసీ) కసరత్తు చేస్తోంది.తెలంగాణలో ప్రకటించాల్సిన 13 స్థానాల్లో ఆరు స్థానాలకు సంబంధించి దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
ఈ సమావేశంలో ఏడు లోక్‌సభ స్థానాలపై చర్చ జరగ్గా.. భువనగిరి మినహా మిగిలిన ఆరు స్థానాలలో అభ్యర్థుల పేర్లకు సీఈసీ దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. పెద్దపల్లి స్థానం నుంచి గడ్డం వంశీ, చేవెళ్లకు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి, మల్కాజిగిరికి సునీతారెడ్డి, నాగర్‌కర్నూల్‌కు పార్టీ సీనియర్ నేత మల్లు రవి, ఆదిలాబాద్ స్థానానికి ఆత్రం సుగుణ, సికింద్రాబాద్‌కు ఖైరతాబాద్ ఎమ్మె్ల్యేగా ఉన్న దానం నాగేందర్‌ల పేర్లపై సీఈసీలో చర్చ జరగ్గా.. ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.
మెదక్‌పై సైలంట్ గా లాబీయింగ్..
సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి బీజేపీ నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. గతంలో కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పుడు తరచుగా గాంధీభవన్‌కు రావడం, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆమె తిరిగి కాంగ్రెస్‌లో చేరినా ఆమె గాంధీభవన్‌కు కానీ, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల తరపునకానీ, పార్టీ విజయానికి కాని ఎక్కడ కూడా ఆమె ప్రచారం చేయలేదు. అప్పుడప్పుడు మీడియా ప్రకటనలు ఇవ్వడంతోనే సరిపెట్టుకున్నారు. అలాంటి ఆమె లోక్ సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విజయశాంతి సైలెంట్ గా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.
లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన పీసీసీ స్క్రీనింగ్ కమిటీ తన పేరును పరిగణనలోకి తీసుకోనప్పటికీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో తనకున్న గత సంబంధాలను ఉపయోగించుకుని పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో విజయశాంతి పేరు ప్రస్తావనకు రావడం పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతిని ఎన్నికల సమయంలో తెలంగాణలో పీసీసీ చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించారు. గతంలో విజయశాంతి ఒకసారి బీఆర్ఎస్ నుంచి లోక్ సభకు ఎన్నిక అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల బీజేపీ లో చేరారు. ఒకట్రెండు రోజుల్లో మరో జాబితా మరికొన్ని ఎంపీల అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ లిస్ట్ లో విజయశాంతికి చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.