ప్రతి పక్షం, దుబ్బాక ఏప్రిల్ 13: 10 ఏళ్ల అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రం లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ యువత సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించి బుద్ది చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. నల్ల ధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామని మోసం చేశారన్నారు. పేదలకు చేసిందేమీ లేదని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందనన్నారు.
మాయ మాటల రఘునందన్ గురించి దుబ్బాక ప్రజలకు తెలుసన్నారు. 6 గ్యారంటీల పేరున అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఏమైందని, రైతు భరోసా, వడ్లకు రూ.500 బోనస్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. నేను వచ్చేటప్పుడు మిరుదొడ్డి లో మహిళా రైతులతో మాట్లాడానని, వడ్లు ఎవరూ కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. కలెక్టర్ గా పనిచేసిన పి. వెంకట్రామరెడ్డి మీకు సుపరిచితుడేనని, ఇక్కడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం జరిగిందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమాల గడ్డ దుబ్బాకలో మెదక్ ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామరెడ్డి కి ఘన విజయం అందిద్దామని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలోనే కేసీఆర్, హరీశ్ రావు లు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మెదక్ పార్లమెంటు ఎన్నిక మనకు అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు.
ఇప్పటికే. కాంగ్రెస్ అభ్యర్ధికి ఆదరణ కరువైందని, బీజేపీ అభ్యర్థికి ఆ పార్టీ వాళ్లే ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు.
మెదక్ ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ.. నేను గెలిచిన నెల రోజుల్లోనే 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి పేద ,యువత విద్యార్థులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. దుబ్బాక గడ్డ అంటే ఉద్యమాల గడ్డ అని, ఇక్కడ నరనరాన తెలంగాణ రక్తం ఉరకలెత్తుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి, గెలిపిస్తే దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి తో కలిసి దుబ్బాక అభివృద్ధి కి జోడెడ్లలా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీ ఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు మనోహర రావు, రొట్టె రాజమౌళి పంతులు, నమిలే భాస్కరా చారి, కత్తి కార్తీక గౌడ్, యూత్ నాయకులు సురేష్ గౌడ్, శేఖర్ గౌడ్, మహేష్ రెడ్డి, ఖలీల్, రాజేందర్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.