లేని పక్షంలో ఆందోళనకు సిద్దం
రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం
ప్రతిపక్షం, సిద్దిపేట, మే 18: భూముల విలువను పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం జిల్లా అధ్యక్షుడు రాజలింగం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియల్ ఎస్టేట్ సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఇప్పటికే నత్తనడకలా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం భూముల విలువ పెంచడంతో పూర్తిగా డీలా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి విలువ లో 7.5శాతం రిజిస్ట్రేషన్ వాల్వూ ఉంటుందని, భూమి విలువ పెరగడం ద్వారా రిజిస్ట్రేషన్ వాల్వూ పెరుగుతుందన్నారు. దీనివల్ల భూముల అమ్మకాలు కొనుగోలు పూర్తిగా నిలిచిపోయి తమ జీవితాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పునర్ అలోచించి 7.5శాతం ఉన్న రిజిస్ట్రేషన్ చార్జీలను మూడు శాతానికి తగ్గించి భూముల విలువలను అలాగే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులమంతా కలిసి ఆందోళన చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, రంగయ్య, కార్యదర్శి దరిపల్లి శ్రీనివాస్, చిన్నా, సభ్యులు నర్సింలు, బాలయ్య, ముగిలి శ్రీనివాస్, చింతల యాదగిరి, అడప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.