Trending Now

‘మేడిపండు’లా మేడిగడ్డ.. అడుగడుగున లోపాలు

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణం మేడిపండులాగానే ఉందని ఎన్డీఎస్​ఏ బృంధం అభిప్రాయ పడింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అడుగడుగున లోపాలున్నట్లు చంద్రశేఖర్‌ అయ్యర్‌ కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది. అనుసరించాల్సిన టెక్నాలజీకి విరుద్ధంగా ఆనకట్ట పనులు చేపట్టినట్లు మూడో రోజు విచారణలో నిపుణుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి తదుపరి కార్యాచరణ కోసం వీలైనంత త్వరగా తగు సూచనలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. మూడు రోజుల పాటు ఇంజినీర్లు, నిర్మాణ సంస్థలతో అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించిన కమిటీ, మరికొంత సమాచారాన్ని ఇవ్వాలని కోరింది.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నియమించిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో లోపాలను గుర్తించినట్లు సమాచారం. దీంతో ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం కురిపించడంతో వారు తెల్లమొహం వేసినట్లు విశ్వసనీయ సమాచారం. వివిధ విభాగాల ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో విస్తృతంగా సమావేశమయ్యారు. మూడు బ్యారేజీలకు సంబంధించిన డిజైన్లు, ఇన్వెస్టిగేషన్స్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకున్నారు. ఆయా విభాగాల ఇంజినీర్లతో విడివిడిగా సమావేశమైన కమిటీ సంబంధిత అంశాలపై పూర్తి సమాచారం సేకరించారు. ఒక ప్రశ్నావళి ప్రకారం ఇంజినీర్ల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

దాటవేత ధోరణి సరికాదు – ఇంజినీర్లపై ఎన్డీఎస్‌ఏ బృందం సీరియస్..

మేడిగడ్డలో పెద్దఎత్తున లోపాలు ఉన్నాయని, బ్యారేజీ వద్ద కట్‌ ఆఫ్‌ వాల్‌, సీకెంట్‌ ఫైల్స్‌ నిర్మాణంలో పాటించాల్సిన ప్రమాణాలు పట్టించుకోలేదని విషయాలు ఎన్డీఎస్ఏ కమిటీ ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. బ్యారేజీలో రాఫ్ట్‌కు సీకెంట్‌ ఫైల్స్‌కు మధ్య మీటరు తేడా ఉందని, దీనికి కారణమేంటని ఇంజినీర్లను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆనకట్ట డీపీఆర్‌లో పేర్కొన్న దానికన్నా క్వాంటిటీస్‌ ఎందుకు పెరిగాయని కమిటీ సభ్యులు ఇంజినీర్లను అడిగినట్లు తెలిసింది. ఈ డీపీఆర్‌ను కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్‌ తయారు చేసింది.వాస్తవాలు పూర్తిగా చెప్పకుండా ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని కమిటీ సభ్యులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు నిర్మించిన సంస్థల ప్రతినిధులతోనూ కమిటీ సమావేశమై అవసరమైన వివరాలు తీసుకొంది. తెలంగాణ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజినీర్లతోనూ సమావేశమై తీసుకున్న చర్యలు, తనిఖీలను సమీక్షించింది. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబోరేటరీకి వెళ్లిన కమిటీ మేడిగడ్డ ఆనకట్ట నమూనాలను పరిశీలించింది. అంచనాలు, సామర్థ్యం, ప్రవాహం తదితరాలను గమనించింది. నమూనా ఆధారంగా ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై అయ్యర్ కమిటీ అధ్యయనం చేసింది.

బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని మార్చాల్సిన అవసరం ఏముంది..?

మేడిగడ్డ అనకట్టపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదికను కమిటీ అడిగింది. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్, అధికారులు వారితో సమావేశమై మధ్యంతర నివేదికతో పాటు మరికొన్ని అంశాలు వివరించారు. వివిధ కాంపోనెంట్లకు కన్సెల్టెన్సీలుగా ఉన్న వారిని వచ్చే వారం దిల్లీ రావాలని చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. ఆనకట్టలకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చంద్రశేఖర్‌ అయ్యర్‌ తెలిపారు. మేడిగడ్డతోపాటు ఇతర ఆనకట్టల అంశం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే!

Spread the love

Related News

Latest News