హైదరాబాద్, ప్రతిపక్షం బ్యూరో: తెలంగాణాపై బీజేపీ ఆగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసేందుకు ప్రయత్నించిన బీజేపీకి గతంలో కన్న మెరుగైన సీట్లు వచ్చాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేక పోయామంటూ మధన పడిన బీజేపీ ఆగ్రనేతలు, వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం 10 స్థానాలను అయినా గెలువాలని స్కెచ్ వేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆగ్రనేతలు వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో వరుసగా పర్యటనలు కొనసాగిస్తూ పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇందులో భాగంగా బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి త్వరలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి 24న ఆయన రానున్నట్లు సమాచారం. బీజేపీ ఆయన రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఆయన చివరి సారిగా గతేడాది డిసెంబర్ 27న రాష్ట్రానికి వచ్చారు.
అమిత్ షా లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలిచి 35 శాతం ఓట్లు సాధించాలని స్థానిక నాయకత్వానికి అమిత్ షా టార్గెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈనెలాఖరులోగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే గత కొన్ని నెలల నుంచి రాష్ట్రంలో కేంద్ర మంత్రులు వరుసగా పర్యటనలు కొనసాగిస్తుండడం గమనార్హం.