అమెరికాలోని టెక్సాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గరు హైదరాబాదీలు, తమిళనాడుకు చెందిన మరొకరు మృతి చెందారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన ఫరూఖ్, ఆర్యన్ రఘునాథ్, లోకేశ్ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెన్‌టోన్‌విల్లేకు వెళ్లేందుకు ఈ నలుగురూ ఒకే వాహనంలో ప్రయాణంచగా… వరుసగా ఐదు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే నలుగురూ చనిపోయారు. ప్రమాదం తర్వాత మృతులు ప్రయాణించిన కారులో మంటలు చెలరేగాయని, వారంతా ఆ మంటల్లో చిక్కుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్ పూలింగ్ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా మృతులను గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరి మృతిపై బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.