South Central Railway has Cancelled Trains: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాల కారణంగా 481 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 1520 రైళ్లను దారి మళ్లించామని, 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది. రద్దయిన రైళ్లల్లో సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. దీంతోపాటు పలు పాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు.
ఇందులో భాగంగా కాజీపేట – డోర్నకల్, డోర్నకల్ – విజయవాడ, విజయవాడ – గుంటూరు, గుంటూరు – విజయవాడ, విజయవాడ – డోర్నకల్, డోర్నకల్ – కాజీపేట, సికింద్రాబాద్ – సిర్ పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్ – షాలిమర్ తదితర రైళ్లను రద్దు చేసింది. ప్రస్తుతం కేసముద్రం, ఇంటికన్నె, తాళ్లపూసపల్లి మార్గాల్లో వర్షాలకు ధ్వంసమైన ట్రాక్ పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి రైళ్లు యథావిధిగా నడిపేలా చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ తెలిపారు.



























