ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువునా దగా చేసిందని కాంగ్రెస్‌పై ఫైరయ్యారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీల విషయంలో ఒట్లు పెట్టి మభ్యపెడుతున్నారు. ఎన్నికలకు ముందు రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ. 15 వేల చొప్పున ఇస్తామన్నరు. వరి పంటకు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామన్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేసేలా ఆలోచన చేయడం లేదు. రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక నయవంచన చేస్తోంది.
గతంలో ఇచ్చిన హామీలను మరిచి, పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ అనేక రకాల కొత్త హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు దేవుడు పేరుతో, దేవతల పేరుతో ఒట్లు పెడుతూ ప్రజలకు పంగనామాలు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక వందరోజుల్లోనే రుణమాఫీ చేస్తామని చెప్పి అమలు చేయలేదు. ఆగస్టుకు వాయిదా వేసి అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, సోనియా గాంధీ జన్మదినం రోజున ( డిసెంబర్ 09న) రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. బ్యాంకులకు అప్పులు కట్టొద్దని.. ఒకవేళ కడితే వెంటనే కొత్తగా రుణాలు తీసుకోండి, రుణమాఫీ చేస్తామంటూ రైతులను నమ్మించేలా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు.
వరిపంటకు రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఈరోజు సన్నవడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మాట మార్చింది. సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ తాజాగా ప్రకటించి.. మెజార్టీ రైతులకు చేయిచ్చింది. రాష్ట్రంలో సన్నవరి పండించేది తక్కువ మందే. వాన కాలంలో 70 శాతం పైగా దొడ్డురకం వరి సాగు చేస్తారు. యాసంగిలో 90 శాతం మంది రైతులు దొడ్డురకం సాగుచేస్తారు. రైతుల నుంచి దొడ్డుబియ్యం కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర అవసరాల కోసం అదనంగా సన్నబియ్యం సేకరించొచ్చు. కానీ కేంద్రం ఎంఎస్ పీ ప్రకారం కొనుగోలు చేస్తామంటున్నా.. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ తో సహా దొడ్డు వడ్లను సేకరించొచ్చు. కానీ దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. బాయిల్డ్ రైస్ ఎంతవచ్చినా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు గతంలోనే ప్రకటించారని గుర్తు చేశారు.
దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుకున్న చందంగా.. కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా ముందుకొచ్చినప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించి రైతులకు అన్యాయం చేస్తోంది. వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సరఫరా చేయాలి. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం సరఫరా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 2023-24 కు రబీ సీజన్ కు సంబంధించి 33 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని మాత్రమే సేకరించింది. రైతుల నుంచి సకాలంలో వరిధాన్యాన్ని సేకరించకుండా, అకాల వర్షాలకు ధాన్యం నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం నోరెళ్లబెట్టి చూస్తోంది. అకాల వర్షాలతో కల్లాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతున్నా.. కొనుగోళ్లు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. పంట పొలాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా, మరోవైపు వర్షాకాలం తరుముకొస్తున్నా ధాన్యం కొనుగోళ్లు మాత్రం నామమాత్రంగా, నత్తనడకన కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో మరో రెండు నెలలు గడిచినా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడింది. సోనియమ్మ రాజ్యం అంటే రైతుల కన్నీళ్లు చూసే రాజ్యమా..? రైతుల కళ్ల నుంచి రక్తం రావాలని కోరుకుంటున్నారా..? కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్ లో కూడా 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంది. ధాన్యం కొనుగోలు విషయంలో మార్కెట్ యార్డు నుంచి బస్తా ఎత్తేవరకు, ధాన్యం ఎఫ్ సీఐ కి చేరేవరకు ట్రాన్స్ పోర్టుకు కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే ఖర్చును భరిస్తుంది. దొడ్డురకం వరివేస్తే రైతులకు గడ్డుకాలమంటూ, దొడ్డురకం వేస్తే అడ్డుకుంటామనే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వంద రోజుల్లో బోనస్ ఇస్తామని ప్రకటించి, కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యం విషయంలో ఎందుకు చెల్లించడం లేదు..? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వందరోజుల్లో వరి ధాన్యంపై (దొడ్డు, సన్నరకం) బోనస్ ఇస్తామని ప్రకటించిన హామీని నిలబెట్టుకోవాలి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్లలో ధాన్యంపై 61 శాతం ఎంఎస్ పీని పెంచింది. 2014లో ఎంఎస్ పీ రూ. 1350 ఉంటే.. నేడు రూ. 2,200 కు కొనుగోలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ ఉంటే.. సన్నవడ్లను ప్రోత్సహించాలనుకుంటే రూ. 1000 బోనస్ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం.. 5 సంవత్సరాలకు రావాల్సిన ప్రజావ్యతిరేకతను కేవలం 5 నెలల్లోనే కూడగట్టుకున్నది. మొదటి నుంచి యావత్ భారతదేశాన్ని మోసం చేస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఎన్నితరాలు గడిచినా కాంగ్రెస్ మోసపూరిత ఆలోచన గుంటనక్క మాదిరిగా ఉంటుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహిస్తామంటూ చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన సోనియా గాంధీని ఆహ్వానిస్తారు..? 1500 మంది ఉద్యమకారులను పొట్టనపెట్టుకున్నందుకు పిలుస్తున్నారా..? అనేక త్యాగాలు, పోరాటాలతో సకలజనులు సమ్మెచేసి అప్పటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. నాడు సుష్మాస్వరాజ్ గారి నేతృత్వంలో పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాగాంధీ దెయ్యమంటూ.. రేవంత్ రెడ్డి స్వయంగా తిట్టారు. ఇప్పుడు దేవత అంటూ పొగుడుతున్నారని గుర్తుచేశారు.