ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడారు. అందరినీ ఆశ్చర్యపరిచేలా.. ఫలితాలు ఉండబోతున్నాయని.. ఎన్నికలు జరిగిన తీరు, మాకు అందుతున్న సమాచారం ప్రకారం.. కమల వికాసం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి మాపై చేసిన దుష్ప్రచారం చేసినా.. ప్రజలు మమ్మల్ని విశ్వసించారు. రిజర్వేషన్లు తదితర అంశాలపై తప్పుడు ప్రచారాలు చేశారు. తెలంగాణలో ఎవరు గెలిచినా.. మేమే కీలకం అన్నట్లు మజ్లీస్ వ్యవహరించిన తీరు కూడా.. బీజేపీకి అనుకూలంగా మారింది. మోదీగారు మళ్లీ ప్రధాని కావాలన్న ఆకాంక్ష తెలంగాణ గ్రామాల్లో స్పష్టంగా కనిపించింది. ప్రజలందరూ కలిసి కూర్చుని మోదీ గారికే ఓటేయాలని నిర్ణయించుకున్నారు. దీని ఫలితంగానే.. ఇవాళ గ్రామాల్లో ఎక్కువ ఓట్లు బీజేపీకి పడ్డాయి.
ఇన్నాళ్లుగా బీజేపీ చొచ్చుకుపోలేని చోట కూడా మోదీ గారి ప్రభావం స్పష్టంగా కనిపించింది.
మోదీ, కమలం గుర్తు గురించి ఊళ్లలో యువత, మహిళలు, రైతులు, కొత్త ఓటర్లలో చర్చ జరిగింది.
ఈ వర్గాలన్నీ ఏకపక్షంగా బీజేపీకి అండగా నిలిచాయని మా విశ్లేషణలో వెల్లడైంది. రాజ్యాంగం మార్చడం, రిజర్వేషన్లు అనే అంశాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తే.. ప్రజలు నవ్వుకున్నారు. రిజర్వేషన్లు ఎత్తేసే శక్తి ఎవరికీ లేదు. అంబేడ్కర్ గారు అనుకున్నా ఇవాళ దేశం నుంచి రిజర్వేషన్లు తొలగించలేరని, మోదీ గారు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఒక అడుగు ముందుకేసి.. నా కంఠంలో ప్రాణముండగా రిజర్వేషన్లు తీసేసే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చే వర్గాలన్నీ ముందుండి బీజేపీకి ఓటేశాయనేది అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను గురించి మాట్లాడలేదు. సోనియా జన్మదినం సందర్భంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఆగస్టుకు వాయిదా వేసిన వ్యక్తి రేవంత్. పాలన ఇంతవరకు మొదలు పెట్టనే లేదు. కానీ.. పార్లమెంటు ఎన్నికలు తన పాలనకు రెఫరెండం అని చెప్పుకున్నాడు.
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం కనబడుతోంది. డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఓ నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా అవతరించబోతోంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అస్తిత్వం కోల్పోనుంది.
ప్రజలు గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఓటేశారు. ఈసారి వారు బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అనవసర ఖర్చులు చాలా చేశాయి. మోదీ గారిని రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించారు. దీనికి ప్రజలు సరైన సమాధానం ఇచ్చారు. జూన్ 4న మీరంతా చూడబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు విషయంలో రాజీ పడబోము. ఇకపైనా బురదజల్లే రాజకీయాలకు, నీచరాజకీయాలపై కాకుండా.. హామీల అమలుపై దృష్టి కేంద్రీకరించండి. సీఎం రేవంత్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైనా దృష్టిపెట్టండి. హామీల అమలుకు ఆర్థిక వనరుల సమీకరణ ఎలా చేయబోతున్నారో రేవంత్ చెప్పాలి. దళితబంధు, కల్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాల అమలు ఎలా జరిగింది.. వాటన్నింటిమీద సమీక్ష జరగాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ వివరాలన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన రాహుల్ గాంధీ.. కొత్త హామీలిచ్చి పోయాడు.
పాత హామీల గురించి మాట్లాడటం మరిచిపోయాడు. రానున్న రోజుల్లో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామన్నారు. పట్టణ ప్రాంతాలన్నింటిలోనూ ఓటింగ్ శాతం తగ్గింది. ఓటరు లిస్టును సంస్కరించాల్సిన అవసరం ఉంది. జిల్లా ఎన్నికల అధికారులకు పదే పదే విజ్ఞప్తి చేశాం. రెండ్రోజుల ముందు.. 20 వేలు, 30 వేల ఓట్లను తొలగించారు. వారం రోజుల ముందు ఓటరు స్లిప్పులు పంపిన ఓటర్లను కూడా తీసేశారు. కావాలనే బీజేపీ ఓట్లను తొలగించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. ఎన్నికల ఓటరు కార్డును, ఆధార్ తో సీడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై అత్యున్నతస్థాయి సమీక్ష జరగాలి. రిగ్గింగ్ జరిగిన బూతుల వివరాలు సేకరిస్తున్నాం. అక్కడ రీపోలింగ్ కు డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు మీకే అనే విషయం.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలు మాకు చెప్పారు. ఆ మాటకు కట్టుబడి ఉండి.. ఇవాళ బీజేపీకి ఓటేసినట్లు మా సమీక్షలో వెల్లడైంది. ఏపీలో ఎన్డీయే కూటమి విజయం సాధించడం ఖాయం. దేశవ్యాప్తంగా.. 400 సీట్లు గెలవడం తథ్యం అని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.