ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన ఆమె బుధవారం విజయవాడ లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే ఏపీకి రాజధాని నిర్మాణం జరగాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని, ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు అడుగు వేయాలని షర్మిల అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా కోసం కట్టుబడాలని, అన్ని విభజన హామీలకు కేంద్రం కట్టుబడాలని.. ఆమె డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ.. జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ, ఇక మీదట కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందని షర్మిల స్పష్టం చేశారు.