ప్రతిపక్షం, సిద్దిపేట, జూలై 04: తెలంగాణ రైతంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని సీపీఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. గురువారం రోజున దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో నిజాం రజాకార్లు ఆగడాలకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమిక కావాలని, వెట్టిచాకిరి విముక్తి పొందాలని తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత పోరాటాలు కొనసాగుతున్నాయి. కడవండి గ్రామంలో రజా కార్లు జాగిర్దారులకు వ్యతిరేకంగా భూసిస్తుకు, కౌలుకు, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దున్నేవాడి చేతుల్లోనే భూమి ఉండాలని నైజాం రజాకర్ల ఆగడాలకు వ్యతిరేకంగా 1946 జూలై 4వ తేదీన నిరసన ప్రదర్శన నిర్వహించిన సందర్భంగా ర్యాలీలో ముందు భాగాన నిలబడ్డ దొడ్డి కొమరయ్య భూస్వాములు తుపాకులతో కాల్పులు జరపగా తుపాకీ గుండ్లకు దొడ్డి కొమరయ్య అమరుడయ్యారు. ఆనాడు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దున్నే వాడికి భూమి కావాలని దొరల ఆగడాల అరికట్టాలని మహత్తర పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య నేటికీ స్ఫూర్తిదాయకమని ఆయన స్ఫూర్తితో నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దోపిడికి క్రీడలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మిస్తామని అందరికీ అన్ని రకాల సౌకర్యాల కల్పన కోసం సిపిఎం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చొప్పరి రవికుమార్, బండ కింది అరుణ్ కుమార్, జాలిగపు శిరీష, దాసరి ప్రశాంత్ నాయకులు కొండం సంజీవ్ కుమార్, నారాయణ అభి తదితరులు పాల్గొన్నారు.