Trending Now

‘జూబ్లీ’ ఫలితంపై ఆత్మ విమర్శ చేసుకుంటాం

మరింత ఓటింగ్​జరగాల్సింది
పార్టీ శ్రేణులకు, ఓటర్లు ధన్యవాదాలు
బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


(ప్రతిపక్షం స్టేట్ బ్యూరో)
హైదరాబాద్, నవంబర్ 14: ‘జూబ్లీ’ ఫలితంపై ఆత్మ విమర్శ చేసుకుంటామని బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మరింత ఓటింగ్ జరిగి ఉండాల్సిందని, బీఆర్ఎస్​కు ఈ ఎన్నికల్లో మంచి ఓటింగ్ వచ్చిందని అన్నారు. బీజేపీ సింగిల్ డిజిట్‌లో ఉండి డిపాజిట్ కోల్పోయిందని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నదని, ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం బానే వర్కౌట్ అయినట్టు కనిపించిందని కేటీఆర్​ అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని ప్రజలు నిరూపించారని అన్నారు. ఈ ఎన్నికల ఫలితం వలన నిరాశ చెందమని, ప్రధాన ప్రతిపక్షంగా మా పనిని చేసుకుంటూ పోతూనే ఉంటామని అన్నారు. ప్రజలతోనే ఉంటాం.. ప్రజల కోసమే ఉంటాం… ప్రజల్లోనే ఉంటాం… తిరిగి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకునేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.. వారికి తోడుగా ప్రతి బూత్‌లో స్థానిక జూబ్లీహిల్స్ పార్టీ శ్రేణులు, నాయకులు కూడా కష్టపడ్డాని, వారందరికీ ధన్యవాదాలలు తెలుపుతున్నామన్నారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు కూడా అభినందనలు చెప్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదయిందని, గత రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో సఫలమయ్యామన్నారు. ఎన్నికల్లో మా పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా పోరాడిందని, ఎన్నికలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారని అన్నారు. ప్రతి సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే ఏజెన్సీలు చెప్పాయని, ఈ ఎన్నిక కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇచ్చిందని కేటీఆర్​ అన్నారు. ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ప్రజల్లో, మీడియాలో చర్చ జరగవలసిన అవసరం ఉందని అన్నారు. ఎన్ని రకాలుగా అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో నెల రోజుల ముందు చెప్పామని, స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండడం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ పనితీరుపైనా చర్చ జరగాలని, ఈ విధంగా ఎన్నికలు జరిగిన తీరుపైన ప్రజాక్షేత్రంలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నదని, ఏదేమైనా ప్రజా తీర్పుని మేము గౌరవిస్తామని కేటీఆర్​ అన్నారు.
పశ్చిమ బెంగాల్లో జరిగిన మాదిరి ఇక్కడ కూడా పార్టీ మారిన నేతలను డిస్క్వాలిఫై చేస్తారని, ఉప ఎన్నికలు వస్తాయి అని ఆశిస్తున్నామని అన్నారు. ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే ఇన్ని అపసోపాలు పడిన కాంగ్రెస్ పార్టీ, 10 ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతామని అన్నారు.

Spread the love

Related News