ప్రతిపక్షం, తెలంగాణ: ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఎల్‌నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.
భూమధ్య రేఖకు ఆనుకుని పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తీవ్రంగా ఉన్న ఎల్‌నినో పరిస్థితులు వేసవి చివరి వరకూ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పసిఫిక్‌లో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగా ఉండనున్నందున ఆ దిశగా వచ్చే గాలులతో దేశంలో మార్చి నుంచి మే నెల వరకూ మూడు నెలలు ఎండలు తీవ్రంగా ఉంటాయి. మార్చిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది.