ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే కార్మికులందరికీ రూ. 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఈ మేరకు కార్మికశాఖతో పాటు పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీసెస్ శాఖలపై ఇవాళ సచివాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
కార్మికుల సంక్షేమం విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు నిర్ధిష్ట ప్రణాళితలో ముందుకెళ్లాలన్నారు. కార్మికుల భద్రతా విషయంలో పరిశ్రమలు రాజీ పడకుడదని, భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలన్నారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తరవాత మళ్లీ సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేదని.. ఇలా కాకుండా నిర్థిష్టమైన ప్రణాళికతో భద్రత కోసం పనిచేయాలన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాదు, రాష్ట్రంలో ఉన్న నాలుగు ఈఎస్ఐ ఆసుపత్రుల సైతం బలోపేతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.