భారీ వరదల వల్ల వరద ప్రభావానికి విజయవాడ అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. అయితే కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండటమే. ఒకవేళ ఇది లేకపోయి ఉంటే.. కృష్ణలంకతో పాటు రాణిగారి తోట మునిగిపోయే పరిస్థితి ఉండేది. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా రిటైనింగ్ వాల్ నిర్మించారు. మొత్తం 3.44 కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజీ కింద గత ప్రభుత్వం హయాంలో ఈ నిర్మాణం జరిగింది. మొత్తం ఆరు డివిజన్లకు రక్షణగా ఈ ప్రహరీ గోడను ఏర్పాటు చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా కృష్ణా నది వరద నుంచి విజయవాడవాసులను కాపాడింది రిటైనింగ్ వాల్ అనే చెప్పాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, ప్రస్తుతం విజయవాడలో ఇదే అంశం హాట్ టాపిక్ అయ్యింది. ఇది తాము నిర్మించామంటే.. లేదు.. తామే నిర్మించామని టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా ప్రకటలు చేస్తున్నాయి.
మంగళవారం వైఎస్ జగన్ కృష్ణ లంక ప్రాంతంలో పర్యటించి బ్రిడ్జిపై నుండి రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాల ప్రజలను పరామర్శించి వెళ్లారు. తమ నాయకుడు జగన్ చొరవ వల్లే ఇవాళ ఈ ప్రాంతం సురక్షితంగా ఉందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కృష్ణ లంక రిటైనింగ్ వాల్ నిర్మాణంపై వైసీపీ, తెలుగు దేశం పార్టీల మధ్య క్రెడిట్ గొడవ మొదలైంది. ఈ ఏడాది మార్చి నెలలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో కృష్ణ లంక రిటైనింగ్ వాల్ ప్రారంభోత్సవం చేశారు. 2.7 కిమీ పొడవుతో నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ వల్ల రాణిగారి తోట, భూపేష్ గుప్త నగర్, తారక రామ నగర్, క్రిష్ణ లంక పరిసర ప్రాంతాల ప్రజలకు కృష్ణా నది నుండి వచ్చే వరద ముంపు లేకుండా అడ్డుకట్టలా నిలిచింది.
వైసీపీ ఏం చెబుతోంది!
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయకపోయి ఉంటే.. ఈ వరదలకు కృష్ణలంకతో పాటు ఆ పరిసర ప్రాంతాలన్నీ జల విళయంలో చిక్కుకుని ఉండేవని వైసీపీ చెబుతోంది. జగన్ హయాంలో కృష్ణలంక రిటైనింగ్ వాల్ పూర్తి చేయడం వల్ల అక్కడ నివాసం ఉంటున్న లక్ష మంది ప్రజలు గతంలో మాదిరిగా అక్కడి నుండి ఖాళీ చేసి పునరావాస శిబిరాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఇవాళ నిశ్చింతగా ఉండగలుగుతున్నారు అనేది అక్కడి వైసీపీ నేతలు చెబుతున్న మాట. కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ నివాసం ఉంటున్న లక్ష మంది ప్రజలకు మేలు చేసిన ఘనత తమ నాయకుడు వైఎస్ జగన్ కే దక్కుతుందని వైసీపీ నేతలు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.
టీడీపీ వెర్షన్ ఏంటి?
విజయవాడ టీడీపీ నేతల వెర్షన్ మరోలా ఉంది. వాస్తవానికి కృష్ణా నది నీరు విజయవాడను ముంచెత్తకుండా 2016లో రిటైనింగ్ వాల్ ప్రతిపాదన తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు. జగన్ కంటే ముందుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిటైనింగ్ వాల్ నిర్మాణంలో మెజార్టీ భాగాన్ని పూర్తి చేశారని.. అందుకే ఈ ప్రాంతాన్ని వరదల బారి నుండి కాపాడిన ఘనత కూడా తమ నాయకుడు చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది అని టీడీపీ వాదిస్తోంది.