ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అన్న’ క్యాంటీన్లపై వైసీపీ కావాలనే విషం కక్కుతోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. తణుకు అన్న క్యాంటీన్‌లో ప్లేట్ల అంశంపై వైసీపీ కుట్రపూరిత బుద్ధి బయటపడిందని అన్నారు. చేతులు కడిగే సింక్‌లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలేనని ఆరోపించారు. ‘విష ప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసింది. సింక్‌లో ఉన్న ప్లేట్లు తీస్తుంటే వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారు. రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.’ అని అన్నారు.
కాగా.. తణుకు అన్న క్యాంటీన్‌లో శుభ్రత పాటించడం లేదంటూ నిన్న సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలైన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేశ్ ఆరా తీశారు. హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్లేట్లను మురికినీటిలో కడుతున్నారనేది పూర్తిగా అవాస్తవమని అధికారులు మంత్రికి తెలిపారు. వాష్ బేసిన్‌లోని ప్లేట్లు తీస్తుంటే వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.