మహిళా సాధికారతకు భారీ ఊతం.. మరో 3 వేల బస్సులు మహిళా సంఘాలకే: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 10: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళా శక్తి పథకం కింద ఇప్పటికే స్వయం సహాయక సంఘాల యాజమాన్యంలోని 553 బస్సులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అప్పగించిన ప్రభుత్వం, రానున్న రోజుల్లో మరో 3 వేల బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన అందజేయనున్నట్లు ప్రకటించారు. మహిళలు కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహణకు అప్పగించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, ఈ సంఖ్యను కోటి మందికి పెంచాలని పిలుపునిచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని ప్రకటించారు. 2034 నాటికి మహిళల ఆర్థిక శక్తిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

మహిళలకు ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక రంగాల్లో అవకాశాలు అందిస్తోందన్నారు. బస్సుల నిర్వహణతో పాటు మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, పాఠశాలల నిర్వహణ వంటి బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ప్రభుత్వం రూ.10 వేల కోట్లకు పైగా చెల్లించిందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల నిర్వహణలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ రంగంలో కూడా మహిళా సంఘాల పాత్రను విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పంటల మార్పిడి పద్ధతులను అనుసరించాలని కోరారు. వరి, మొక్కజొన్నలతో పాటు పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు రూ.2,400 కోట్లతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. రైతులకు పంటల మార్పిడి, మార్కెటింగ్‌పై అవగాహన కల్పించే బాధ్యతను మహిళా సంఘాలు తీసుకోవాలని కోరారు.

మహిళల ఆస్తి హక్కులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుపైనే మంజూరు చేస్తున్నామని, పట్టణ ప్రాంతాల్లో నిర్మించనున్న లక్ష ఇళ్లను కూడా మహిళల పేర్లపైనే కేటాయిస్తామని వెల్లడించారు. కుటుంబంలో మహిళ ఆర్థికంగా బలపడితే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. బ్యాంకు అనుసంధాన రుణాల కింద ఇప్పటికే రూ.61 వేల కోట్లకు పైగా సాయం అందించామని, వడ్డీలేని రుణాల కోసం బ్యాంకులకు రూ.2 వేల కోట్లు చెల్లించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో మహిళా శక్తి భవనాలను ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసి మహిళలకు శిక్షణ, ప్రణాళికల రూపకల్పనకు వేదికగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.500 కోట్ల చెక్కులు, బస్సుల అద్దె రూపేణా రూ.20.34 కోట్ల చెక్కు అందజేశారు. అలాగే ఉచిత ప్రయాణ పథకం అమలుతో మహిళలు ఆదా చేసుకున్న రూ.10,700 కోట్ల వివరాలను ప్రకటించారు. మహిళల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్న ముఖ్యమంత్రి, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News